టోక్యో: ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్.. టోక్యోలో జరుగుతున్న 25వ సమ్మర్ డెఫ్లింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో 23 ఏండ్ల ధనుష్.. 252.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాజా ప్రదర్శనతో గతంలో అతడే నెలకొల్పిన ప్రపంచ రికార్డు (251.7) కూడా కనుమరుగైంది.
భారత్‌కే చెందిన మహ్మద్ వానియా (250.1) రజతం సాధించడంతో దేశానికి డబుల్ ఆనందం దక్కినైట్టెంది. దక్షిణ కొరియాకు చెందిన బేక్ సెంఘక్ (223.6) కాంస్యం సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో తెలంగాణ షూటర్.. 630.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ధనుశ్, వానియతో పాటు మహిళా షూటర్లు రెండు పతకాలతో మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో మహిత్ (250.5) రజతం గెలువగా ఇదే పోటీలో కోమల్ మిలింద్ (252.4) కాంస్యం నెగ్గింది.
స్వర్ణంతో మెరిసిన ధనుష్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ. 1.20 కోట్ల నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ధనుష్‌కు ఈ నగదు బహుమానాన్ని అందజేయనున్నట్టు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.