హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన రాష్ట్ర యువ అథ్లెట్ జివాంజీ దీప్తి ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. విశ్వక్రీడల్లో మహిళల 400మీ. టీ20 విభాగంలో మెరిసిన దీప్తికి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి కోటి రూపాయల చెక్ అందజేశారు. దీప్తి కోచ్ నాగపురి రమేశ్‌కు 10లక్షలు నగదు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ రాష్ర్టానికి కీర్తి, ప్రతిష్ఠలు తీసుకొచ్చే ప్లేయర్లను కచ్చితంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. క్రీడారంగంలో సమూల మార్పులు తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.