నేరేడ్మెట్, డిసెంబర్ 16 : 37వ సబ్ జూనియర్ అండర్-13 జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2025లో తెలంగాణ బాలికలు అద్భుత ప్రతిభను ప్రదర్శించి జాతీయ వేదికపై సత్తా చాటారు. అండర్-13 బాలికల డబుల్స్ విభాగంలో రాష్ట్ర జట్టు ఏకంగా మూడు పతకాలు సాధించింది.
దియా ఆనంద్-అబ్బా జాధవ్ జోడి బంగారు పతకం కైవసం చేసుకోగా, ప్రొద్దుటూర్ అన్య-కైరా ద్వయం రజతం, ల్యోష్య- మనస్విని జోడి కాంస్యం గెలిచింది. బాయ్స్ డబుల్స్‌లో సుహాస్ కండేపి బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ విజయాలపై భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్‌తో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచింగ్ సిబ్బంది క్రీడాకారిణులను అభినందించారు.