హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలంగాణ చదరంగ క్రీడాకారుల జాబితాలో మరో చాంపియన్ అవతరించింది. రాష్ర్టానికి చెందిన శరణ్య దేవి నరహరి.. 37వ జాతీయ అండర్-13 గర్ల్స్ చెస్ చాంపియన్షిప్-2024 టైటిల్ను సొంతం చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఈనెల 17 నుంచి 24 వరకు జరిగిన ఈ టోర్నీలో శరణ్య.. 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి సత్తా చాటింది.
ఆద్యంతం హోరాహోరిగా సాగిన ఈ టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన తమిళనాడుకు చెందిన నివేదిత.. 8.5 పాయింట్లతో శరణ్యకు గట్టిపోటీనిచ్చింది. ఇదే టోర్నీలో తెలంగాణకు చెందిన దీక్షిత (8.5 పాయింట్లు), శివాంషిక (8 పాయింట్లు) వరుసగా 6,7వ స్థానాల్లో నిలవడం విశేషం.