హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పోలీసు అకాడమీలో నిర్వహించిన ఆలిండియా ప్రిజన్స్ డ్యూ మీట్-2025లో వరసగా రెండో సారి తెలంగాణ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. వృత్తిపరమైన ఈ పోటీల్లో డ్రిల్స్, గేమ్స్, రేసులు, ఫైన్ ఆర్ట్స్ వంటి 36 రకాల ఈవెంట్లలో పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ 7వ డ్యూటీ మీట్లో తెలంగాణ జైళ్ల శాఖ అద్భుతమైన ప్రతిభను కనబరిచి, ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించి మొత్తం 28 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఇందులో 21 స్వర్ణాలు సహా 4 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. గురువారం జరిగిన ముగింపు వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు పతకాలు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్,డీజీ సౌమ్యామిశ్రా, డీజీ అభిలాష బిస్త్, హాజరయ్యారు.