హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 27 నుంచి తెలంగాణ జిల్లాల అండర్-17 క్రికెట్ టీ20 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో కలిసి ప్రముఖ అంకాలజిస్ట్, భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం అధ్యక్షుడు సతీశ్ కత్తుల, ఎన్నారై వైద్యులు నాథ రమణ మూర్తి పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి చెందాలి. ఈ టోర్నీతో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రానుండటం అభినందనీయం’ అని అన్నారు. అల్లీపురం మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో ఉమ్మడి 9 జిల్లాలు సహా టీడీసీఏ ఎలెవన్ జట్లు పోటీపడనున్నాయి. ఇక్కడ ప్రతిభ చూపిన క్రికెటర్ల నుంచి మూడు జట్లను ఎంపిక చేసి మార్చి మూడో వారంలో అమెరికా క్రికెట్ అకాడమీ జట్టుతో మ్యాచ్లను నిర్వహిస్తాం’ అని అన్నారు.