ISSF Junior World Cup : ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత షూటర్లు (Indian Shooters) పతకాల వేట కొనసాగిస్తున్నారు. పోటీ పడి మరీ పోడియం మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. సోమవారం కూడా భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో తేజస్విని (Tejaswani) పసిడితో మెరిసింది. ఎనిమిది పోటీ పడగా.. ఐదు షూట్ల తర్వాత ఆమె 31 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. దాంతో, పతకాల పట్టికలో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో తేజస్విని 575 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో గురి తప్పకుండా గన్ పేల్చిన తను స్వర్ణంతో భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. అయితే.. క్వాలిఫయర్‌లో అగ్రస్థానంలో నిలిచిన చైనా షూటర్ టవోటవో ఝావో (Taotao Zhao) ఐదో స్థానంతో నిరాశపరిచింది. అయితే.. ఇదే విభాగంలో పోటీపడిన భారత అమ్మాయిలు రియా శిరీష్ థట్టే, నామ్య కపూర్, వివాన్షిలు వరుసగా 15, 18, 24వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
India’s Tejaswani wins GOLD at ISSF Junior World Cup in Suhl!! 🇮🇳🥇
She clinched the top honour in the Women’s 25m Pistol event, bringing India’s total to 11 medals in the competition.#Shooting pic.twitter.com/UdZOZzCjty
— Khel Now (@KhelNow) May 26, 2025
తేజస్విని తర్వాతి ప్లేస్‌లో నిలిచిన బెలారస్ అమ్మాయి అలీనా నెస్టియరోవిచ్ వెండి పతకం గెలవగా.. హంగేరీ షూటర్ మిరియం జాకో కాంస్యంతో మురిసింది. మొత్తంగా చూస్తే.. భారత బృందం మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 11 మెడల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ టోర్నీలో మే 23న శుక్రవారం యువ షూటర్ అడ్రియాన్ కర్మాకర్ (Adriyan Karmakar) కాంస్యంతో గర్జించాడు. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్‌లోకి కంచు మోత మోగించి రెండో మెడల్ ఖాతాలో వేసుకున్నాడు. తొలిసారి వరల్డ్ కప్‌లో పోటీ పడుతున్న ఈ కుర్ర షూటర్ గురువారం 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.