నకిరేకల్, మే 26 : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యా తీవ్ర సంక్షోభంలో ఉందని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సమూలమైన మార్పులతో తగు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బడులు నిలబడతాయన్నారు. లేకుంటే నాలుగైదు సంవత్సరాల్లో మెజార్టీ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చేరలేక మూతపడిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులు నిలబడాలి..చదువుల్లో అంతరాలు పోవాలనే నినాదంతో తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాత సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చదువుల్లో మార్పు రావాలి, ఉన్నోడి పిల్లలైనా, లేనోడి పిల్లలైనా ఒకే బడిలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పని చేస్తుందన్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బడుగుల పిల్లల కోసమే అన్న చందంగా మారిందన్నారు. చదువును ఎంత పెట్టి కొనగలిగే వారికి అంత ఫీజులతో ప్రైవేట్ రంగంలో బడులు వచ్చాయని, ఎంత డబ్బు ఫీజుగా చెల్లించగలిగితే అంత గొప్ప చదువులు లభిస్తాయని ప్రైవేట్ విద్యా సంస్థల ప్రచారం తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు టి.నర్సింహ్మమూర్తి, ఆర్.రాకేశ్‌కుమార్, పి.జయసాగర్, కె.శ్రీనివాస్, కె.రవికుమార్, ప్రజా సంఘాల నాయకులు ఆర్.వెంకన్న, ఎ.తాజేశ్వర్, టాప్రా నాయకులు సీహెచ్. అంజిరెడ్డి, బి.ప్రకాశ్‌రావు, ఐద్వా నాయకులు సీహెచ్.నాగమణి, బి.ఇందిర, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీందర్, సీఐటీయూ నాయకులు వంటెపాక వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ నాయకులు వి.కృష్ణ పాల్గొన్నారు.