హాంకాంగ్: ఫిడే వరల్డ్ టీమ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్ నాయకత్వంలోని టీమ్ ఎంజీడీ1 రజతం అందుకుంది. శుక్రవారం ముగిసిన ఈ మెగా టోర్నీలో చైనాకు చెందిన డ్రాగన్ చిల్లింగ్ జట్టు విజేతగా నిలిచింది. చిల్లింగ్, ఎంజీడీ1, హెక్సామైండ్ జట్లు తలో 18 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే, మెరుగైన టైబ్రేకర్ స్కోరు (647.5) సాధించిన చైనాకు చెందిన డ్రాగన్ చిల్లింగ్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.
డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఎంజీడీ1 జట్టు 632 టైబ్రేకర్ స్కోరుతో రన్నరప్ నిలిచింది. మెజారిటీ ఇండియన్స్‌తో కూడిన ఎంజీడీ జట్టులో అర్జున్ 12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. నిహాల్ సరిన్ (10 మ్యాచ్‌ల్లో 6.5), ద్రోణవల్లి హారిక (12 మ్యాచ్‌ల్లో 7.5), లో-రేటింగ్ బోర్డుపై ఆడిన ఆర్యన్ షా (12 మ్యాచ్‌ల్లో 10.5)రన్నరప్‌గా నిలిచినందుకు అర్జున్ జట్టు సుమారు రూ. 70 లక్ష ప్రైజ్ మనీ అందుకుంది.