‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అన్న రీతిలో విరాట్ వీరంగమాడిన వేళ.. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో టీమ్ఇండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. కోహ్లీ అజేయ శతకానికి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మెరుపులు తోడవడంతో భారత్ భారీ స్కోరు చేయగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి లంక 73 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 317 పరుగుల తేడాతో జయభేరి మోగించి కొత్త రికార్డు సృష్టించడంతో పాటు 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
తిరువనంతపురం: క్రీజులో నిలదొక్కుకుంటే తానెంత ప్రమాదకారో విరాట్ కోహ్లీ మరోసారి ప్రపంచానికి చాటాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో శతక్కొట్టిన విరాట్.. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన ఆఖరి పోరులో భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. వన్డే క్రికెట్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్‌సేన 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. రన్‌మెషీన్ కోహ్లీ (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) దంచికొట్టగా..
శుభ్‌మన్ గిల్ (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ (42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (38) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో కసున్ రజిత, లహిరు కుమార చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 22 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ (4/32), షమీ (2/20), కుల్దీప్ (2/16) ధాటికి లంకేయులు చేతులెత్తేశారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న టీమిండియా.. బుధవారం ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడనుంది.
వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే (317) భారీ విజయం. న్యూజిలాండ్ (ఐర్లాండ్‌పై 290 పరుగులతో) పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
1. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ (21) రికార్డుల్లోకెక్కాడు.
సచిన్ టెండూల్కర్ (20) రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 8 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో అతడికి ఇవే అత్యధికం.
2. వన్డేల్లో కోహ్లీకి ఇది (166*) రెండో అత్యధిక స్కోరు. 2012లో పాకిస్థాన్‌పై చేసిన 183 అతడి టాప్ స్కోర్.
4. జనవరి15న విరాట్ సెంచరీ చేయడం ఇది నాలుగోసారి. సంక్రాంతి పందెం పుంజు తరహాలో 2017 (ఇంగ్లండ్‌పై 122), 2018 (దక్షిణాఫ్రికాపై 153), 2019 (ఆస్ట్రేలియాపై 104)లో కోహ్లీ సెంచరీలు నమోదు చేశాడు.