World Cup 2023 : సొంత గడ్డపై భారత జట్టు రెండో ప్రపంచ కప్ ట్రోఫీ(ODI World Cup)ని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. 12 ఏండ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ని ఒడిసిపట్టుకునేందుకు సిద్ధమైంది. బుధవారం వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి దర్జాగా ఫైనల్‌కు దూసుకెళ్లి.. మూడోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయేందుకు కాచుకొని ఉంది. తొలిసారి 1983లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు ఇది నాలుగో ఫైనల్ కావడం విశేషం. ఈసారి కప్పు కొడితే.. ఆస్ట్రేలియా(5సార్లు) తర్వాత అత్యధికంగా వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించనుంది. అంతేకాదు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తనముద్ర వేసిన రోహిత్ శర్మ.. దిగ్గజ సారథులు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీల సరసన నిలుస్తాడు.
ప్రపంచ క్రికెట్లో 1970 -80ల్లో వెస్టిండీస్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించగా.. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది అనిపిస్తోంది. అవును.. ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా సొంత గడ్డపై పుష్కరకాలం తర్వాత జరుగుతున్న మెగా టోర్నీ ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది. 2019లో సెమీస్‌లో ఓటమితో ఇంటిదారి పట్టిన భారత్… ఈసారి ఆకలిగొన్న సింహంలా జూలు విదుల్చుతోంది. లీగ్ దశలో భారత జట్టు జోరుకు అన్ని జట్లు తలవంచాయి.
టోర్నీలో తలపడుతున్న అన్ని జట్లను వరుస పెట్టి ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లోనూ అదే చేసింది. విరాట్ కోహ్లీ(117) శతకాల అర్ధ సెంచరీతో విరుచుకుపడగా.. శ్రేయాస్ అయ్యర్(105) విధ్వంసక శతకాలతో రెచ్చిపోయాడు.. దాంతో, భారత్ ప్రత్యర్థి ముందు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపి.. ఆ తర్వాత షమీ 7 వికెట్లతో విజృంభించడంతో కివీస్ 327 రన్స్‌కే కుప్పకూలింది. అంతే.. ఆ క్షణం డగౌట్, స్టేడియంలోని వేలాది మందితో పాటు కోట్లాదిమంది భారతీయులు జయహో భారత్ అంటూ నినదించారు.
కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983లో పెద్ద అద్భుతమే చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి చాంపియన్‌గా అవతరించింది. లీగ్ దశలో ఓటములతో వెనకబడినా అనూహ్యంగా పుంజుకొని సెమీస్‌కు చేరింది. సెమీఫైనల్లో కెప్టెన్ కపిల్ దేవ్(175) సెంచరీతో శివమెత్తగా భారత్ అలవోకగా జింబాబ్వేపై గెలుపొంది. టైటిల్ పోరులో క్లైవ్ లాయిడ్
సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. తొలుత ఇండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ తర్వాత అమర్నాథ్ 3 వికెట్లతో హడలెత్తించగా.. కరీబియన్ జట్టు 140కే పరిమితమైంది. అలా కపిల్ సేన భారత్‌ను తొలిసారి విశ్వ విజేతగా నిలిపింది. ఆ క్షణం భారత క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది.
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన 2003 వరల్డ్ కప్‌లో సౌరభ్ గంగూలీ కెప్టెన్సీలోని భారత జట్టు అదరగొట్టింది. కానీ, జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. రికీ పాంటింగ్ సెంచరీతో ఆసీస్ 359 పరుగులు బాదగా..
ఆ తర్వాత మెక్‌గ్రాత్ ఆదిలోనే సచిన్ టెండూల్కర్(4)ను ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (82), రాహుల్ ద్రవిడ్(47) చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు చేతులేత్తేయడంతో 125 పరుగుల భారీ తేడాతో పరాజయం చెందింది.
సొంతగడ్డపై 2011లో భారత జట్టు రెండోసారి వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. 274 పరుగుల ఛేదనలో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది. గౌతం గంభీర్(97) విలువైన ఇన్నింగ్స్ ఆడగా.. నువాన్ కులశేఖర బౌలింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(91 నాటౌట్)
సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. అంతే … భారదేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనాలు సచిన్‌ను భుజాలపై ఎత్తుకొని స్టేడియమంతా తిరిగారు. ఆ అద్భుత దృశ్యాన్ని భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.