BCCI : రికార్డు స్థాయిలో మూడోసారి పొట్టి ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన భారత జట్టు (Team India) ఐపీఎల్ తర్వాత బిజీగా ఉండనుంది. టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ (BCCI) తెలిపింది. ఇవి మొత్తం 22 మ్యాచ్‌లు ఉండగా.. వీటిలో రెండింటికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికవ్వనుంది. బెంగళూరు, గువాహటి, అహ్మదాబాద్, రాంచీలోనూ భారత జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది.
స్వదేశంలో అదిరే ఆటతో పొట్టి వరల్డ్‌కప్‌ను ముద్దాడిన టీమిండియా వచ్చే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ ఏడాది కీలక మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ముఖ్యమైన ద్వైపాక్షిక సిరీస్‌లతో శుభ్‌మన్ గిల్ సేన ముందంజ వేయాలనే కసితో ఉంది. 2026-27 సీజన్ విషయానికొస్తే.. సొంతగడ్డపై 22 మ్యాచ్‌లతో ప్రేక్షకులను అలరించనుంది. మూడు ఫార్మాట్ల పరంగా చూస్తే 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయంతే. గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు దూరమైన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు గేమ్స్ జరుగనున్నాయి.
Presenting the fixtures for #TeamIndia‘s (Senior Men) international home season 2026-27 🗓️ 👉
It all begins with the limited-overs series against West Indies in September 2026 👌 pic.twitter.com/7qCnMiShvB
— BCCI (@BCCI) March 26, 2026
ద్వైపాక్షికి సిరీస్ కోసం సెప్టెంబర్‌లో భారత్‌కు వెస్టిండీస్ జట్టు రాబోతుంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం కరీబియన్ జట్టు సెప్టెంబర్ – అక్టోబర్‌లో ఇండియాలో ఉండనుంది. తిరువనంతపురం, గువాహటి, న్యూ ఛండీగఢ్ మూడు వన్డేలకు వేదికలుగా ఎంపికయ్యాయి. లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో భారత్, విండీస్ జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్ అనంతరం డిసెంబర్ 13 నుంచి 27 వరకూ శ్రీలంకతో మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది టీమిండియా. ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో వన్డేలు.. రాజ్‌కోట్, కటక్, పుణేలో పొట్టి క్రికెట్లో ఆతిథ్య భారత్‌ను లంక ఢీకొట్టనుంది.
కొత్త ఏడాది(2027) ఆరంభంలో జింబాబ్వే జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియాకు రానుంది. వీటిలో ఒక మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఎంపికవ్వగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడేలో మిగతా రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ బృందం బిజీగా ఉండనుంది.

జనవరి 21 నుంచి మార్చి 7వ తేదీ వరకూ ఇరుజట్లు ఐదు మ్యాచ్‌ల బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తలపడతాయి. నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్‌లో టెస్టు మ్యాచ్‌లు ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మాజాను పంచడం ఖాయం.