పొట్టి ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు తొలి పరాజయం ఎదురైంది. గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు రాణించడంతో దుమ్మురేపిన రోహిత్ సేన.. ఈ సారి టాపార్డర్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. పేస్‌కు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై ఎంగ్డీ, పార్నెల్ నిప్పులు చెరగడంతో.. మనవాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటంతో జట్టుకు పోరాడే స్కోరు అందించగా.. పేసర్లు ఆరంభంలో ఆకట్టుకున్నా.. చివరి వరకు పట్టు కొనసాగించలేకపోయారు. అర్ష్‌దీప్, షమీ దెబ్బకు ఒక దశలో దక్షిణాఫ్రికా 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆ జట్టు టార్గెట్ ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్-2లో దక్షిణాఫ్రికా టాప్కు చేరగా.. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి!
పెర్త్: పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్‌శర్మకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి టీ20 ప్రపంచకప్‌లో ఎదురులేకుండా సాగుతున్న భారత్‌కు.. దక్షిణాఫ్రికా ఓటమి రుచిచూపింది. గ్రూప్-2లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఫలితంతో దక్షిణాఫ్రికా (5 పాయింట్లు) గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరగా.. భారత్ (4 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసింది. ‘360 డిగ్రీస్ ప్లేయర్’ సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు ఎక్కువసేపు నిలువలేకపోయారు. రాహుల్ (9) పేలవ ఫామ్ కొనసాగించగా.. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (12) అతడిని అనుసరించారు. ప్రపంచకప్‌లో తొలిసారి అవకాశం దక్కించుకున్న దీపక్ హుడా (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. బిగ్ హిట్టర్లు హార్దిక్ పాండ్యా (2), దినేశ్ కార్తీక్ (6) నిరాశ పరిచారు. సఫారీ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఎంగ్డీ 4, పార్నెల్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 రన్స్ చేసింది. డేవిడ్ మిల్లర్ (46 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్మ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 2, షమీ, పాండ్యా, అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు. భారత తమ తదుపరి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమ్ఇండియాకు బౌలింగ్‌లో శుభారంభం దక్కింది. రెండో ఓవర్లో అర్ష్‌దీప్.. డికాక్ (1), రాసో (0)ను ఔట్ చేయగా.. కాసేపటికే కెప్టెన్ బవుమా (10)ను షమీ బుట్టలో వేసుకున్నాడు. ఇక భారత్ పోటీలోకి వచ్చినట్లే అనుకుంటున్న దశలో మార్క్మ్,్ర మిల్లర్ క్రీజులో కుదురుకోగా.. మన వాళ్ల పేలవ ఫీల్డింగ్ వారికి ఇతోధిక సాయం చేసింది. 9వ ఓవర్లో మార్కరమ్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని రోహిత్ జారవిడవగా.. 11వ ఓవర్లో సూర్యకుమార్ వేసిన త్రో కూడా వికెట్లను గిరాటేయలేకపోయింది. తదుపరి ఓవర్లో మార్క్మ్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ వదిలేయడం మరింత దెబ్బకొట్టింది. ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకున్న మార్క్మ్ విలువైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాసేపటికి మిల్లర్‌ను రనౌట్ చేసే చాన్స్‌ను రోహిత్ మరోసారి జారవిడిచాడు. మార్క్మ్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంలో హార్దిక్, కోహ్లీ మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇలాంటి అవకాశాలను సొమ్ము చేసుకున్న మిల్లర్, మార్క్మ్ జట్టును విజయానికి చేరవ చేశారు. చివరి 3 ఓవర్లలో ఆ జట్టుకు 25 పరుగులు కావాల్సిన దశలో అశ్విన్ వరుస బంతుల్లో సిక్సర్లు సమర్పించుకొని సఫారీల విజయానికి బాటలు వేశాడు. వెన్నెముక నొప్పితో దినేశ్ కార్తీక్ మధ్యలో మైదానాన్ని వీడగా.. అతడి స్థానంలో కాసేపు రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.
ఈ పరాజయంతో భారత్ కాస్త కలవరపాటుకు గురి కాగా.. మన కంటే పాకిస్థాన్ ఎక్కువ బాధ పడుతున్నది. ప్రస్తుతం గ్రూప్-2లో మూడేసి మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా (5 పాయింట్లు), భారత్ (4 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే నెగ్గిన పాకిస్థాన్ (2 పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నెగ్గి ఉంటే.. పాక్ సెమీస్ సమీకరణాలు సులభతరమయ్యేవి. కానీ, ఈ ఫలితంతో ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ తప్పక గెలువాల్సిన పరిస్థితి నెలకొంది!
భారత్: రాహుల్ (సి) మార్క్మ్ (బి) ఎంగ్డీ 9, రోహిత్ (సి అండ్ బి) ఎంగ్డీ 15, కోహ్లీ (సి) రబడ (బి) ఎంగ్డీ 12, సూర్యకుమార్ (సి) మహారాజ్ (బి) పార్నెల్ 68, హుడా (సి) డికాక్ (బి) నోర్జె 0, పాండ్యా (సి) రబడ (బి) ఎంగ్డీ 2, కార్తీక్ (సి) రాసో (బి) పార్నెల్ 6, అశ్విన్ (సి) రబడ (బి) పార్నెల్ 7, భువనేశ్వర్ (నాటౌట్) 4, షమీ (రనౌట్/నోర్జె) 0, అర్ష్‌దీప్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 133/9. వికెట్ల పతనం: 123, 2-26, 3-41, 4-42, 5-49, 6-101, 7-124, 8-127, 9-130, బౌలింగ్: పార్నెల్ 4-1-15-3, రబడ 4-0-26-0, ఎంగ్డీ 4-0-29-4, నోర్జె 4-0-23-1, కేశవ్ 3-0-28-0, మార్క్మ్ 1-0-5-0.
దక్షిణాఫ్రికా: డికాక్ (సి) రాహుల్ (బి) అర్ష్‌దీప్ 1, బవుమా (సి) కార్తీక్ (బి) షమీ 10, రాసో (ఎల్బీ) అర్ష్‌దీప్ 0, మార్క్మ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 52, మిల్లర్ (నాటౌట్) 59, స్టబ్స్ (ఎల్బీ) అశ్విన్ 6, పార్నెల్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 19.4 ఓవర్లలో 137/5. వికెట్ల పతనం: 1-3, 2-3, 3-24, 4-100, 5-122, బౌలింగ్: భువనేశ్వర్ 3.4-0-21-0, అర్ష్‌దీప్ 4-0-25-2, షమీ 4-0-13-1, పాండ్యా 4-0-29-1, అశ్విన్ 4-0-43-1.