Team India | చెన్నై: స్వదేశంలో సుమారు ఆరు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టు ఈ మేరకు సన్నాహకాలు మొదలుపెట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈనెల 19 నుంచి జరుగబోయే తొలి టెస్టు కోసం ఇది వరకే నగరానికి చేరుకున్న టీమ్ఇండియా.. శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. జట్టు సభ్యులంతా గురువారం నాటికే ఇక్కడికి చేరగా శుక్రవారం ఉదయం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమ్‌తో కలిశారు. గత నెలలో హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్‌తో పాటు అతడి కోచింగ్ బృందం అభిషేక్ నాయర్(అసిస్టెంట్ కోచ్), బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌కు స్వదేశంలో ఇదే తొలి సిరీస్. గంభీర్ బృందం పర్యవేక్షణలో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది.
దులీప్ ట్రోఫీ తొలి దశ పోటీలు ముగిసిన తర్వాతే చెన్నైకి చేరుకున్న కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, తదితర ఆటగాళ్లు మైదానంలో కొంతసేపు ప్రాక్టీస్ చేశారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కొంతకాలం పాటు విరామం తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో చెమటోడ్చాడు. అతడితో పాటు సిరాజ్, తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన యశ్ దయాల్ సైతం బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. తొలి టెస్టుకు ఎంపికైనా ఇంకా జట్టుతో చేరని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ముగియగానే చెన్నైకి రానున్నాడు.
ఆగస్టులో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడిన అనంతరం కుటుంబంతో కలిసి ఇంగ్లండ్‌లో గడుపుతున్న విరాట్ కోహ్లీ స్వల్ప విరామం తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయమే చెన్నైకి చేరుకున్న కోహ్లీ.. విమానాశ్రయం నుంచి నేరుగా టీమ్హోటల్కు చేరుకున్నాడు. అనంతరం జట్టుతో కలిసిన అతడు.. 45 నిమిషాల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టు ఆడిన తర్వాత మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడనుండటం కోహ్లీకి ఇదే మొదటిసారి. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో అతడు దూరంగా ఉన్న విషయం విదితమే.