BCCI President | సెప్టెంబర్ చివరలో బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్నాయి. జులై 9న 70 సంవత్సరాలు నిండడంతో రోజర్ బిన్నీ పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు ఐపీఎల్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. అయితే, ఎన్నికల సమయంలో ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ అరుణ్ కుమార్ ధుమాల్ తప్పనిసరి మూడేళ్ల కూలింగ్ పీరియడ్‌లో కొనసాగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అదే సమయంలో ఓ ప్రముఖ క్రికెటర్‌ను బీసీసీఐ అధ్యక్షుడిని చేయాలనే ప్రణాళిక ఉన్నది. గతంలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీలను అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా పెద్ద ఆటగాడినే అధ్యక్షుడిగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఆ ప్లేయర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. ఏ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారో.. వారి కోసం అన్వేషణ మొదలైంది.
ఐపీఎల్ చైర్మన్ పదవికి ఇద్దరు పేర్లు చర్చిస్తున్నారు. ఇందులో బీసీసీఐ ఉపాధ్యక్షుడి రాజీవ్ శుక్లా, ముంబయి క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంజయ్ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శుక్లా గతంలో కూడా ఐపీఎల్ చైర్మన్‌గా పని చేశారు. అయితే, ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదు. శుక్లా ఐపీఎల్ చైర్మన్ అయితే.. బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, బీజేపీ నాయకుడు రాకేష్ తివారీని ఉపాధ్యక్షుడిగా చేసే అవకాశం ఉంది. కొన్ని పదవులకు మాత్రం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు లోధా కమిటీ రాజ్యాంగం మేరకు జరుగుతాయి. జాతీయ క్రీడా పరిపాలన బిల్లు ఇంకా నోటిఫై లేదు. దాని కారణంగా బిల్లు ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం లేదు.
రాజీవ్ శుక్లా 2020లో ఉపాధ్యక్షుడి నియామకమయ్యారు. లోధా కమిటీ ప్రకారం, ఆయనకు మరో సంవత్సరం పదవీకాలం మిగిలి ఉంది. ఆ తర్వాత ఆయన కూలింగ్ పీరియడ్‌లో వెళ్లాల్సి ఉంటుంది. అయితే, వచ్చే ఏడాది వార్షిక సర్వసభ్య సమావేశంలో బిల్లు ప్రకారం ఎన్నికలు జరిగితే.. ఆయన కూలింగ్ పీరియడ్‌లో వెళ్లాల్సిన అవసరం ఉండదు. దేవ్జిత్ సైకియా జాయింట్ సెక్రటరీ, సెక్రటరీగా మూడు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. కానీ, ఆయన తదుపరి కార్యదర్శిగా కొనసాగుతారు. జాయింట్ సెక్రటరీలు రోహన్ దేశాయ్, ప్రభతేజ్ భాటియా ఒక సంవత్సరం పూర్తి చేశారు. ఇద్దరూ తమ పదవీకాలాన్ని మరికొద్ది రోజులు కొనసాగించనున్నారు.