ICC Rankings: వన్డే వరల్డ్ కప్‌లో అపజయం ఎరుగని జట్టుగా జైత్రయాత్ర సాగిస్తున్న భారత క్రికెట్ జట్టు.. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగులలోనూ దుమ్మురేపింది. విభాగం ఏదైనా అందులో భారత ఆటగాళ్లు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకోగా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో వన్డేలతో పాటు మిగిలిన మూడు ఫార్మాట్లలో అగ్రస్థానాలను కైవసం చేసుకుంది.
వన్డే ర్యాంకింగ్స్‌లో 830 పాయింట్లతో శుభ్‌మన్ గిల్ నెంబర్ వన్ బ్యాటర్ కాగా 770 పాయింట్లతో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 739 పాయింట్లతో రోహిత్ ఆరో స్థానంలో నిలిచాడు. బౌలర్లలో 709 పాయింట్లతో సిరాజ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా 661 పాయింట్లతో కుల్దీప్ యాదవ్, 654 పాయింట్లతో బుమ్రా 8వ స్థానంలో ఉండగా 635 పాయింట్లతో మహ్మద్ షమీ పదో స్థానంలో నిలిచాడు.
టీ20లలో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. 863 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టులలో టాప్ -10 బ్యాటర్లలో రోహిత్ శర్మ పదో స్థానంలో ఉండగా బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ప్రథమ స్థానంలో, రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో జడ్డూ నెంబర్ వన్ స్థానంలో ఉండగా రెండో స్థానంలో అశ్విన్, ఐదో స్థానంలో అక్షర్ పటేల్ ఉన్నారు.
ICC poster for Shubman Gill & Mohammed Siraj.
– Indian cricket is ruling. 🔥 pic.twitter.com/LIUes5mXry
— Johns. (@CricCrazyJohns) November 8, 2023
మూడు ఫార్మాట్లలో భారత జట్టు నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. టెస్టులలో 118 రేటింగ్ పాయింట్లతో ఇండియా అగ్రస్థానంలో ఉండగా వన్డేలలో 121 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. టీ20లలో కూడా 265 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.