చెస్టర్-లి-స్ట్రీట్ (యూకే) : ప్రపంచ చాంపియన్ల హోదాలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి పసికూన చేతిలో బొక్కబోర్లా పడ్డ భారత టీ20 జట్టు మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ఐరిష్ టీమ్ చేతిలో క్లీన్‌స్వీప్‌ను మరిచిపోకముందే ఈ ఫార్మాట్లో అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఉన్న ఇంగ్లండ్‌తో ఐదుమ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. బుధవారం చెస్టర్-లి-స్ట్రీట్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. బ్యాటింగ్ వైఫల్యాలు, పసలేని బౌలింగ్‌తో ఐర్లాండ్‌కు సిరీస్ అప్పగించుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో ఎలా ఆడతారనేది ఆసక్తికరం. ఐపీఎల్లో వీరబాదుడుకు అలవాటు పడి బ్యాటర్లను పరీక్షపెట్టిన బెల్ఫాస్ట్ పిచ్‌పై తేలిపోయిన భారత స్టార్ బ్యాటర్లకు ఇక్కడా అలాంటి పరిస్థితులే ఎదురుకానున్నాయి. తొలి టీ20 జరిగే వేదికలో గత 8 మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 138గా నమోదవడం గమనార్హం.
బౌలర్లకు సహకరించే ఈ పిచ్‌పై జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సకిబ్ మహమ్ముద్ వంటి పేస్ త్రయంతో పాటు అదిల్ రషీద్, రెహాన్ అహ్మద్ స్విన్ ద్వయాన్ని శ్రేయస్ అయ్యర్ సేన ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో అభిషేక్, రెండో మ్యాచ్‌లో తిలక్ మినహా మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమవగా వారు ఇంగ్లండ్‌లో ఏ మేరకు పుంజుకుంటారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక జాతీయ జట్టులో సిరీస్ ఓటమితో కెప్టెన్సీ కెరీర్‌ను ఆరంభించిన శ్రేయస్.. ఈ సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తే గనుక అతడికి టీ20 టీమ్‌లో చోటు కూడా అనుమానమే అవుతుంది. ఐర్లాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేస్తాడని భావించినా బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో కూడా చోటు దక్కడం అనుమానమే. అతడిని ఆడిస్తారా? అన్న ప్రశ్నకు కెప్టెన్ అయ్యర్ సైతం సమాధానాన్ని దాటవేయడం గమనార్హం.