హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాలుగు రోజుల పాటు హోరాహోరీగా సాగిన తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అండర్-17 టీ20 టోర్నీ ఘనంగా ముగిసింది. గురువారం జరిగిన ఫైనల్లో టీడీసీఏ ఎలెవన్ 13 పరుగుల తేడాతో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించింది. తొలుత టీడీసీఏ ఎలెవన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది.
ఓపెనర్ మహేశ్ జాదవ్(63 బంతుల్లో 101 నాటౌట్, 16ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో విజృంభించగా, శివశంకర్(34 బంతుల్లో 52, 8ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. లక్ష్యఛేదనలో మహబూబ్‌నగర్ 19.3 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ సంజు(41), వీరేందర్(27), దీపక్పాటిల్(24) రాణించినా లాభం లేకపోయింది. టీడీసీఏ బౌలర్లు దీక్షిత్(3/23), అరుణ్‌కుమార్(2/26), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మహేశ్(2/26) ఆకట్టుకున్నారు. టీడీసీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి విజేతలకు ట్రోఫీ అందజేశారు.