BAN vs NED : ఆసియా కప్ బరిలో ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh) మెగా టోర్నీకి ముందు దుమ్మురేపుతోంది. సొంతగడ్డపై నెదర్లాండ్స్ (Netherlands)తో జరిగిన తొలి టీ20లో బంగ్లా ఘన విజయం సాధించింది. తొలుత పేసర్ తస్కిన్ అహ్మద్ (4-28) తన పేస్ పవర్ చూపించి డచ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అనంతరం స్వల్ప ఛేదనలో కెప్టెన్ లిటన్ దాస్(54 నాటౌట్) హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. దాంతో.. ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని 13.3 ఓవర్లలోనే అందుకుంది. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన బంగ్లా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొడుతోంది. ఆసియా కప్ సన్నద్ధతగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న పొట్టి సిరీస్ ఘనంగా బోణీ కొట్టింది లిటన్ దాస్ బృందం. ఆల్‌రౌండ్ షోతో డచ్ జట్టుకు చెక్ పెట్టిన బంగ్లా సునాయసంగా గెలుపొందింది. మొదట ప్రత్యర్థి జట్టును సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మద్ (4-28) గట్టి దెబ్బ కొట్టాడు. టాపార్డర్, మిడిలార్డర్లోని కీలక ఆటగాళ్లను పెవిలియన్ చేర్చి నెదర్లాండ్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అయితే.. ఓపెనర్ మాక్స్ ఓడౌడ్(23), తెలుగబ్బాయి తేజ నిడమనూరు(26)లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 రన్స్ ఆ జట్టు చేయగలిగింది.
Taskin Ahmed shines in a strong Bangladesh bowling effort, Netherlands end on 136/8 #NEDvBAN LIVE 👉 https://t.co/uJ1U0rrFzS pic.twitter.com/hS6VEcJO4U
— ESPNcricinfo (@ESPNcricinfo) August 30, 2025
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆదిలోనే ఓపెనర్ పర్వేజ్ హొసేన్(15) ఔటైనా.. కెప్టెన్ లిటన్ దాస్(54 నాటౌట్) క్రీజులో పాతుకుపోయాడు. మరో ఓపెనర్ తంజిద్ హసన్(29)తో కలిసి బౌండరీల మోతతో స్కోర్ బోర్డును ఉరికించాడు లిటన్. వీరిద్దరూ రెండో వికెట్‌కు 60 ప్లస్ భాగస్వామ్యంతో బంగ్లాను గెలుపు దిశగా నడిపారు. తంజిద్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన సైఫ్ హసన్(36 నాటౌట్) డచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ అజేయంగా నిలిచి జట్టుకు 8 వికెట్ల విజయాన్ని కట్టబెట్టారు. తన సూపర్ బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టిన తస్కిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 1న జరుగనుంది.