హైదరాబాద్, : హైదరాబాద్కు చెందిన తన్వీ వల్లెం అరుదైన ఘనత సొంతం చేసుకుంది. పిట్ట కొంచెం కూత ఘనమన్న రీతిలో తన్వీ స్నూకర్లో అద్భుత ప్రతిభతో అదరగొడుతున్నది. ప్రపంచ పూల్ బిలియర్డ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపీఏ) ఆహ్వానం మేరకు సాన్జువాన్లో సోమవారం నుంచి మొదలవుతున్న వరల్డ్ జూనియర్ 9 బాల్ చాంపియన్షిప్లో తన్వీ బరిలోకి దిగుతున్నది. పిన్న వయసులో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్యూయిస్టుగా ఈ 9 ఏండ్ల హైదరాబాదీ కొత్త రికార్డు నెలకొల్పింది. బాలికల జూనియర్ విభాగంలో భారత్ నుంచి పోటీపడుతున్న ఏకైక ప్లేయర్గా తన్వీ నిలువడం విశేషం.
ఈ విభాగంలో బరిలో ఉన్న మిగతా ప్లేయర్ల సగటు వయసు 15 ఏండ్లు. హైదరాబాద్లో పుట్టిన తన్వీ కుటుంబం ప్రస్తుతం అమెరికాలోని మేరిల్యాండ్లో నివాసముంటున్నది. గత అక్టోబర్లో తొలి అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొన్న తన్వీ సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. చిన్నతనంలో తన్వీ ప్రతిభను గుర్తించిన తండ్రి వీరేశ్ స్నూకర్లో శిక్షణ ఇప్పించారు. గత నాలుగు నెలల నుంచి ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటున్న తన్వీ మరిన్ని విజయాలు అందుకోవాలన్న పట్టుదలతో ఉంది.