లక్నో: ఒక దళిత బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక మిస్సింగ్‌పై పోలీసులు మూడు రోజుల పాటు వెతికారు. 600కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరకు డాక్టర్‌తో సహా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. (Dalit girl abducted, raped) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దళిత కుటుంబానికి చెందిన 17 ఏళ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒకచోటకు ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాలిక అదృశ్యం గురించి ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 600కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. డాక్టర్ మహమ్మద్ ఆదిల్ సహకారంతో నాజిమ్ ఆ బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ బాలిక ఆచూకీ కోసం మూడు రోజులుగా వెతికారు. చివరకు శుక్రవారం ఆ బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఆమెను రక్షించారు.
మరోవైపు ఎదురుకాల్పుల్లో గాయపడిన నజీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహ నిందితుడైన డాక్టర్ మహమ్మద్ ఆదిల్‌ను కూడా అరెస్టు చేశారు. ఆ ఇద్దరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. శనివారం వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు.