గువాహటి : బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో సంచలన విజయాలతో సాగిన భారత యువ షట్లర్ తన్వి శర్మ ఫైనల్లో తడబడింది. ఆదివారం ఇక్కడ ముగిసిన బాలికల సింగిల్స్ ఫైనల్లో తన్వి.. 7-15, 12-15తో రెండో సీడ్ అన్యాపత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు పతకం ఖాయం చేసి ఫైనల్ చేరిన ఈ పంజాబ్ యువ సంచలనం..
సైనా నెహ్వాల్ (2008లో) తర్వాత స్వర్ణం గెలిచే క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుందని భావించినా తుది మెట్టుపై తడబడ్డ ఆమె వెండికే పరిమితమైంది. తొలి గేమ్‌లో 4-4తో సమంగా ఉన్నా తర్వాత చేసిన తప్పిదాలతో అన్యాపత్ 10-5తో ఆధిక్యం సాధించడమే గాక గేమ్నూ గెలుచుకుంది. రెండో గేమ్‌లో ఒక దశలో తన్వి 6-1తో నిలిచినా మళ్లీ పదే పదే నెట్‌కు ఆడుకుని మూల్యం చెల్లించుకుంది.