చెన్నయ్ :చెస్ ఒలింపియాడ్‌లో తానియా సచ్దేవ్ ప్రతిభతో భారత మహిళల జట్టు ముందంజ వేసింది. సోమవారం జరిగిన పోరులో భారత మహిళల ‘ఎ’ జట్టు 2.5-1.5 పాయింట్ల తేడాతో హంగరీపై గెలుపొందింది. కడవరకు పోరాడిన తానియా జట్టును గెలిపించింది. తానియా గేమ్ మినహా తతిమా మూడు గేమ్‌లు డ్రాగా ముగిసాయి. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి తమ మ్యాచ్‌లను డ్రాగా ముగించారు. కాగా 11వ సీడ్ ఇండియా మహిళల ‘బి’ జట్టు కూడా 2.5-1.5 తేడాతో ఎస్తోనియాపై గెలుపొందింది. వంతిక అగర్వాల్ తన మ్యాచ్‌లో గెలుపొంది జట్టుకు విజయాన్ని చేకూర్చింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లలో టాప్‌సీడ్ అమెరికా జట్టులోని ప్రముఖ క్రీడాకారిణి ఫాబియానో కరోనా.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 17 ఏళ్ల నొదిర్బక్ అబ్దుసత్తరొవ్ చేతిలో పరాజయం చవిచూసింది. నొదిర్బక్ సత్తాతో ఉజ్బెకిస్థాన్ అమెరికాను 2-2 స్కోరుతో నిలువరించింది.
ఓపెన్ కేటగిరిలో ఇండియా‘బి’ 3-1తో ఇటలీపై గెలుపొందింది. గుకేష్, నిహాల్ సరిన్ విజయాలు సాధించగా, యువ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని తమ మ్యాచ్‌లను డ్రా చేసుకున్నారు. కాగా రెండో సీడ్ ఇండియా ‘బి’ జట్టు ఫ్రాన్స్‌తో 2-2గా డ్రా చేసుకోగా, ఇండియా ‘సి’ జట్టు స్పెయిన్ చేతిలో 1.5-2.5 తేడాతో పరాజయం పాలైంది.