హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ సోమాజిగూడలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఇటీవల బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ టీటీ మిక్స్డ్ డబుల్స్‌లో శరత్ కమల్‌తో కలిసి స్వర్ణం నెగ్గిన ఈ యువ ప్యాడ్లర్ ఆదివారం గ్రాండ్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది.
ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గొప్ప కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని.. మొక్కల వల్ల సకాలంలో వర్షాలు పడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని.. కాలుష్య నివారణకు మొక్కలు విరివిగా నాటాలని పేర్కొంది. అనంతరం తన కోచ్ సోమ్‌నాథ్ ఘోష్, స్నేహితురాలు కృతిక, బంధువు ఉమామహేశ్వరరావుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది.