అబుధాబి: టీ20 ప్రపంచకప్లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టును మైకేల్ లీస్క్ (44), క్రిస్ గ్రీవ్స్ (25) ఆదుకున్నారు. ఇప్పటికే 5 వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో మరో వికెట్ పడకుండా వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతున్నారు.
ఈ మ్యాచ్ తొలి ఓవర్లోనే స్కాట్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ బ్యాట్స్మెన్ జార్జ్ మున్సే, కాలమ్ మెక్లాయిడ్, కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ ముగ్గురూ డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ మాథ్యూ క్రాస్ (19) ఫర్వాలేదనిపించాడు. క్రెయిగ్ వాలేస్ (4) నిరాశపరిచాడు. ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో లీస్క్, గ్రీవ్స్ జోడీ స్కాట్లాండ్ జట్టును ఆదుకుంది. వీరిద్దరి వల్లే ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటిందనడంలో తప్పేమీ లేదు.
కానీ 17వ ఓవర్లో జోరుమీదున్న లీస్క్ను జేజే స్మిత్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మార్క్ వాట్ (3) అవుటయ్యాడు. 20వ ఓవర్ చివరి బంతికి గ్రీవ్స్ రనౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయిన స్కాట్లండ్ జట్టు 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్ 3, జాన్ ఫ్రైలింక్ 2, జేజే స్మిత్, డేవిడ్ వీజ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.