టీ20 ప్రపంచకప్ గ్రూప్ బీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఘనవిజయం సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫర్ (32 బంతుల్లో 72 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంతితో కూడా రాణించిన అతను రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ మైకేల్ జోన్స్ (86), రిచీ బెర్నింగ్టన్ (37) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. పాల్ స్టిర్లింగ్ (8), ఆండీ బాల్బిర్నీ (14) పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన లోర్గాన్ టక్కర్ (20), హారీ టెక్టర్ (14) కూడా నిరాశ పరిచారు.
అయితే కర్టిస్ కాంఫర్‌తో జతకలిసిన జార్జ్ డాక్రెల్ (39 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో లక్ష్యం మంచులా కరిగిపోయింది. దీంతో ఆ జట్టు 19 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మొత్తమ్మీద మరో ఆరు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, బ్రాడ్ వీల్, సఫయాన్ షరీఫ్, మైకేల్ లీస్క్ తలో వికెట్ తీసుకున్నారు.