ప్రైజ్ మనీ
చాంపియన్ ఇంగ్లండ్ 13 కోట్లు రన్నరప్ పాకిస్థాన్ 6.5 కోట్లు
క్రికెట్ పుట్టినిైల్లెన ఇంగ్లండ్.. రెండోసారి టీ20 ప్రపంచకప్ ముద్దాడింది. సంప్రదాయ ఫార్మాట్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఇన్నాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోని ఇంగ్లిష్ జట్టు.. బాదినోడే బాద్షా అన్న రీతిలో తమ ఆటతీరును మార్చుకొని విశ్వ విజేతగా నిలిచింది. మూడేండ్ల క్రితం లార్డ్స్‌లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన ఇంగ్లండ్.. మెల్బోర్న్లో పొట్టి కప్పును కైవసం చేసుకొని ఏకకాలంలో రెండు ఫార్మాట్లలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది!
మెల్బోర్న్: పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత ప్రమాదకారిగా మారిన ఇంగ్లండ్ జట్టు.. టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. తొలి బంతి నుంచి దంచికొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు.. ఆదివారం మెల్బోర్న్ మైదానంలో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసి రెండోసారి వరల్డ్ కప్ చేజిక్కించుకుంది. 2010లో తొలిసారి ఈ ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్.. పుష్కరకాలం తర్వాత రెండో కప్పును ఒడిసి పట్టింది. తుదిపోరులో టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ గెలిచేసిన ఇంగ్లండ్.. తొలుత పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 రన్స్ చేసింది. షాన్ మసూద్ (38) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (32), షాదాబ్ ఖాన్ (20) పర్వాలేదనిపించారు. రిజ్వాన్ (15), హరీస్ (8), ఇఫ్తిఖార్ (0), నవాజ్ (5) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ 3, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 రన్స్ చేసింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) తుదివరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (26), బ్రూక్ (20), మోయిన్ అలీ (19) తలా కొన్ని పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో రవుఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ ఆసాంతం బంతితో రాణించిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
బౌలర్ల హవా సాగిన తుదిపోరులో
బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ మరోసారి ఇంగ్లండ్ హీరోగా నిలువగా.. ఎన్నో ఆశలతో ఫైనల్లో అడుగుపెట్టిన పాకిస్థాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కరన్, రషీద్ ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపించడంతో ఆ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కాగా.. బౌలర్లు పోరాడినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడలేకపోయారు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 20 ఓవర్లలో 137/8 (మసూద్ 38, బాబర్ 32; సామ్ కరన్ 3/12, రషీద్ 2/22), ఇంగ్లండ్: 19 ఓవర్లలో 138/5 (స్టోక్స్ 52 నాటౌట్, బట్లర్ 26; హరీస్ రవుఫ్ 2/23).2
అత్యధిక పరుగులు
విరాట్ కోహ్లీ 296
అత్యధిక వికెట్లు
వణిండు హసరంగ 15
అత్యధిక వ్యక్తిగత స్కోరు
రిలీ రాసో 109
అత్యుత్తమ సగటు
విరాట్ కోహ్లీ 98.66
అత్యధిక అర్ధశతకాలు
విరాట్ కోహ్లీ 4
అత్యధిక సిక్సర్లు
సికందర్ రజా 11
అత్యధిక ఫోర్లు
సూర్యకుమార్ యాదవ్ 35