గ్లాస్గో (స్కాట్లాండ్): ధనాధన్ క్రికెట్లో సంచలనం నమోదైంది. నెదర్లాండ్స్, నేపాల్ మధ్య సోమవారం రాత్రి ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన టీ20 మ్యాచ్ మొదట టై అవగా ఆ తర్వాత ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. పొట్టి క్రికెట్లో ఒక మ్యాచ్‌లో మూడో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం రావడం ఇదే ప్రథమం. వివరాల్లోకెళ్తే.. నెదర్లాండ్స్, నేపాల్ మధ్య గ్లాస్గోలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 152/7 పరుగులు చేసింది.
ఛేదనలో నేపాల్ విజయానికి చివరి ఓవర్లో 17 రన్స్ అవసరమవగా ఆ జట్టు 16 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలి సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నేపాల్.. 19 రన్స్ చేసింది. బదులుగా నెదర్లాండ్స్ కూడా అన్నే పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈసారి డచ్ జట్టు నేపాల్ ఎదుట 18 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
కానీ నేపాల్ కూడా 17 పరుగుల వద్దే ఆగిపోవడంతో మూడో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అయితే నెదర్లాండ్స్ బౌలర్ జాచ్ లయాన్.. నాలుగు బంతుల్లోనే ఇద్దరు నేపాల్ బ్యాటర్లను ఔట్ చేశాడు. విజయానికి ఒక పరుగు అవసరమైన దశలో లెవిట్.. తొలి బంతికే భారీ సిక్సర్ బాది ఈ ఉత్కంఠ పోరుకు తెరదించాడు.