పారిస్: సీజన్ మూడో గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆధునిక టెన్నిస్‌లో మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్స్గా కొనసాగుతున్న ఇగా స్వియాటెక్ (పోలండ్), బెలారస్ బామ అరీనా సబలెంక మరోసారి ముఖాముఖి తలపడనున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ వేర్వేరు మ్యాచ్‌లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్‌లో కీలకపోరుకు సిద్ధమయ్యారు.
ఎర్రమట్టి కోర్టులో తనకు తిరుగులేదని నిరూపిస్తూ ఐదో సీడ్ స్వియాటెక్ 6-1, 7-5తో ఎలీనా స్విటోలినా (ఉక్రెయిన్)ను వరుస సెట్లలో చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్వియాటెక్ 3 ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టింది. మరో పోరులో ఒకటో సీడ్ సబలెంక 7-6 (7/3), 6-3తో కిన్వెన్ జెంగ్ (చైనా)ను ఓడించింది. గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌లో సబలెంకకు ఇది 11వ సెమీఫైనల్.