Ganesh Pandal | భారత్‌లో వినాయక చవితి సందర్భంగా పలు చోట్ల నిర్వాహకులు గణేశుడిని చిత్ర విచిత్రమైన ఆకారాలతో రూపొందించడం కొత్తేం కాదు. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా విఘ్ననాథుడు.. పలు రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. గుజరాత్‌లోని వపిలో నిర్వాహకులు వినూత్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ థీమ్‌ను ప్రెజెంట్ చేస్తూ రూపొందించిన విధానం అక్కడి ప్రజలను ఆకర్షించడమే గాక సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్, అందుకు సంబంధించిన అపురూప క్షణాలను రీక్రియేట్ చేస్తూ తయారుచేసిన ఈ మండపాన్ని చూసేందుకు స్థానికంగా ప్రజలు ఎగబడుతున్నారు.
ఈ ఏడాది వేసవిలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య బార్బడోస్ (వెస్టిండీస్) వేదికగా జరిగిన ఫైనల్ ఆద్యంతం ఆసక్తిగా సాగిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా హార్దిక్ పాండ్యా వేసిన ఫుల్‌టాస్ బంతిని షాట్ ఆడబోయిన డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాఫ్ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్ దగ్గర పట్టిన క్యాచ్ గురించి భారత క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేరు. దశాబ్దకాలం తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీని దక్కించుకోవడంలో ఆ క్యాచ్ ఎంత కీలకపాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అప్పట్లో ఆ క్యాచ్ చుట్టూ వివాదం నెలకొన్నా టీవీ రిప్లేలలో సూర్య.. బౌండరీ లైన్‌కు ఇవతలే క్యాచ్ పట్టినట్టు స్పష్టంగా తేలిన సంగతి తెలిసిందే.
Suryakumar Yadav’s catch (T20 World Cup Final) theme Ganesh Pandal in Vapi, Gujarat. pic.twitter.com/0RTsbAOpBZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2024
తాజాగా ఇదే మూమెంట్‌కు సంబంధించిన థీమ్‌తో వాపిలో రూపొందించిన వినాయక మండపం భక్తులను విశేషంగా అలరిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు, భారత ఫీల్డర్లు ఆసక్తిగా చూస్తుండటం, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుల కేరింతలు… ఇలా ప్రతీ క్షణాన్ని రీక్రియేట్ చేసినట్టుగా మండపాన్ని మలచడం విశేషం. దీన్నంతటినీ పై నుంచి వినాయకుడు కుర్చీలో కూర్చుని చూస్తున్నట్టుగా రూపొందించారు. అంతేగాక పైన రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్ అందుకున్న ఫోటోను ఉంచడం ఫ్యాన్స్‌ను విశేషంగా అలరిస్తోంది.