IPL | చెన్నై: వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్-18లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సమిష్టిగా రాణించిన సన్‌రైజర్స్.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదుచేసింది. చెపాక్‌లో చెన్నైపై సన్‌రైజర్స్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం. లో స్కోరింగ్ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల ఛేదనను ఆ జట్టు.. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్, 3 ఫోర్లు) రాణించారు.
మొదట హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై.. 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ (4/28), పాట్ కమిన్స్ (2/21), జయదేవ్ ఉనద్కత్ (2/21) ఆతిథ్య జట్టును భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఈ సీజన్లో చెన్నైకి తొలి మ్యాచ్ ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42, 1 ఫోర్, 4 సిక్సర్లు), అయుశ్ మాత్రె (19 బంతుల్లో 30, 6 ఫోర్లు) సీఎస్కేను ఆదుకున్నారు. ఈ సీజన్లో చెన్నైకి ఇది ఆడిన 9 మ్యాచ్‌లకు గాను ఏడో ఓటమి. ఈ ఫలితంతో ప్లేఆఫ్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించినట్టే.
స్వల్ప ఛేదనలో హైదరాబాద్ ఇన్నింగ్స్ కూడా చెన్నై మాదిరిగానే సాగింది. ఖలీల్ రెండో బంతికే ప్రమాదకర అభిషేక్ శర్మను ఔట్ చేసి సీఎస్కేకు తొలి బ్రేకిచ్చాడు. నాలుగు బౌండరీలతో కుదురుకున్నట్టే కనిపించిన ఇంప్యాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ (19).. అన్షుల్ ఆరో ఓవర్లో క్లీన్‌బౌల్డ్ అయి మళ్లీ నిరాశపరిచాడు. నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన క్లాసెన్ (7)ను జడ్డూ బోల్తా కొట్టించాడు. అయితే ఈ సీజన్లో తొలి మ్యాచ్ సెంచరీ తర్వాత వరుసగా విఫలమైన ఇషాన్.. చెన్నైతో పోరులో మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. రెండో వికెట్‌కు హెడ్‌తో 37 పరుగులు, మూడో వికెట్‌కు అనికేత్‌తో 36 రన్స్ జత చేసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన శైలికి భిన్నంగా ఆడిన ఇషాన్.. అర్ధశతకానికి సమీపిస్తున్న క్రమంలో నూర్ అహ్మద్ వరుస ఓవర్లలో ఎస్ఆర్హెచ్కు రెండు షాకులిచ్చాడు. 12వ ఓవర్లో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్‌ను ఔట్ చేసిన అతడు.. మరుసటి ఓవర్లో అనికేత్నూ పెవిలియన్‌కు పంపి చెన్నైలో గెలుపు ఆశలు రేపాడు. కానీ మెండిస్, నితీశ్ రెడ్డి (19 నాటౌట్).. ఎలాంటి సంచలనాలకూ తావివ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఈ సీజన్లో బ్యాటింగ్ వైఫల్యాలతో తేలిపోతున్న సీఎస్కే.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ దానినే కొనసాగించింది. ఇన్నింగ్స్ తొలి బంతికి వికెట్ కోల్పోయిన ఆ జట్టు.. పడుతూ లేస్తూ నామమాత్రపు స్కోరు సాధించింది. చెన్నైకి ఆడుతున్న అరంగేట్ర ఆటగాడు బ్రెవిస్, ఇటీవలే ఆ జట్టుకు ఎంట్రీ ఇచ్చిన అయుశ్ ఇద్దరే ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌తో మళ్లీ ఎస్ఆర్హెచ్ తుది జట్టులోకి వచ్చిన షమీ.. తొలి బంతికే షేక్ రషీద్‌ను డకౌట్ చేసి సీఎస్కేను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. మూడో స్థానంలో సామ్ కరన్ (9)ను ఆడించినా అతడూ విఫలమయ్యాడు. హర్షల్ ఐదో ఓవర్లో కరన్.. అనికేత్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ అయుశ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. బౌండరీతో పరుగుల వేటను ప్రారంభించిన ఈ మహారాష్ట్ర కుర్రాడు.. కమిన్స్, ఉనద్కత్ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు రాబట్టాడు.
కానీ కమిన్స్.. ఆరో ఓవర్లో అయుశ్ను ఔట్ చేయడంతో చెన్నై కష్టాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బ్రెవిస్.. జడేజా (21)తో కలిసి కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే మెండిస్.. పదో ఓవర్లో అద్భుతమైన బంతితో జడ్డూను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 17 బంతుల్లో 17 పరుగులే చేసిన బ్రెవిస్.. మెండిస్ 12వ ఓవర్లో జూలు విదిల్చాడు. తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన ‘నో లుక్ సిక్స్’తో పాటు మరో రెండు సిక్సర్లు దంచడంతో చెన్నై స్కోరు 100 దాటింది. కానీ హర్షల్ మరుసటి ఓవర్లో లాంగాఫ్ వద్ద మెండిస్ కళ్లుచెదిరే డైవింగ్ క్యాచ్‌తో బ్రెవిస్ ఇన్నింగ్స్ ముగిసింది. శివమ్ దూబే (12), ధోనీ (6) విఫలమవగా ఆఖర్లో దీపక్ హుడా (22) కీలక పరుగులు జతచేశాడు. స్పిన్‌కు సహకరించే చెపాక్ పిచ్‌పై ఎస్ఆర్హెచ్ పేసర్లు ఏకంగా 9 వికెట్లు పడగొట్టడం విశేషం. అదీగాక ఈ సీజన్లో ఒక జట్టును ఆలౌట్ చేయడం హైదరాబాద్‌కు ఇదే ప్రథమం.
ఈ మ్యాచ్‌తో ధోనీ తన సుదీర్ఘ కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20లలో మహీకి ఇది 400వ మ్యాచ్. భారత్ నుంచి ఈ రికార్డు సాధించినవారిలో అతడు నాలుగో క్రికెటర్. ఈ జాబితాలో రోహిత్ శర్మ (456 మ్యాచ్‌లు), దినేశ్ కార్తీక్ (412), విరాట్ కోహ్లీ (408).. ధోనీ కంటే ముందున్నారు. ఈ ఫార్మాట్లో ధోనీ.. 7,500కు పైగా పరుగులు చేశాడు.
చెన్నై: 20 ఓవర్లలో 154 ఆలౌట్ (బ్రెవిస్ 42, అయుష్ 30, హర్షల్ 4/28, కమిన్స్ 2/21);
హైదరాబాద్: 18.4 ఓవర్లలో 155/5 (ఇషాన్ 44, మెండిస్ 32*, నూర్ 2/42, కంబోజ్ 1/16)