వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలుకాబోతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఎ 20) కు సంబంధించిన వేలం ప్రక్రియలో సఫారీ యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ దుమ్మురేపాడు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన తొలిరోజు వేలంలో స్టబ్స్.. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్.. స్టబ్స్‌ను 9.2 మిలియన్ ర్యాండ్ (సుమారు రూ. 4.1 కోట్లు) లకు దక్కించుకుంది.
భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం వేలం ప్రారంభమైంది. సౌతాఫ్రికా వేదికగా ఈ వేలం జరుగుతున్నా ఇక్కడ ఫ్రాంచైజీలను దక్కించుకున్నది ఐపీఎల్ యజమానులే కావడం గమనార్హం. ఆరు ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఓనర్లవే. వేలం ప్రక్రియ కూడా ఐపీఎల్ ఆక్షన్ మాదిరిగానే కొనసాగింది. పది సీజన్ల పాటు ఐపీఎల్ వేలం నిర్వహించిన ‘రిచర్డ్ మ్యాడ్లీ’నే అక్కడా ఈ ప్రక్రియను నిర్వహించాడు.
తొలి సెట్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించారు. ఈ క్రమంలో సఫారీ బౌలర్ లుంగి ఎంగిడి.. వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఎంగిడిని పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్) దక్కించుకుంది. ఇక స్టబ్స్ కోసం ఈస్ట్రన్ కేప్ తో పాటు ఎంఐ కేప్‌టౌన్ (ముంబై ఇండియన్స్) పోటీ పడ్డాయి. కానీ స్టబ్స్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న ఈస్టర్న్ కేప్.. ధర పెరుగుతున్నా వెనుకాడలేదు.
ఇదిలాఉండగా స్టబ్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడటం గమనార్హం. ఎస్ఎ20లో అతడు ఫ్రాంచైజీ మారాల్సి ఉంది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో నిర్వహించిన సీఎస్ఎ టీ20 ఛాలెంజ్‌లో స్టబ్స్.. 7 మ్యాచుల్లో 183.12 స్ట్రైక్ రేట్‌తో 293 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడుతూ 6 మ్యాచుల్లో 119 పరుగులు చేశాడు.
Tristan Stubbs is ours to keep 🧤#OrangeArmy #SEC #SunrisersEasternCape #SA20Auction pic.twitter.com/6CCzLHc0vk
— Sunrisers Eastern Cape (@SunrisersEC) September 19, 2022