న్యూఢిల్లీ: జాతీయ హాకీ జట్టుకు ప్లేయర్ల వీడ్కోలు పరంపర కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులో సభ్యులైన రూపిందర్‌పాల్‌సింగ్, బిరేంద్ర లక్రా ఇప్పటికే వీడ్కోలు పలుకగా తాజాగా వెటరన్ స్ట్రైకర్ ఎస్వీ సునీల్ అదే బాటలో పయనించాడు. తన 14 ఏండ్ల సుదీర్ఘ హాకీ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం సునీల్ పేర్కొన్నాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన 32 ఏండ్ల సునీల్ ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నాడు. యువకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీల్ పేర్కొన్నాడు. కర్నాటకకు చెందిన సునీల్ తన కెరీర్లో టీమ్ఇండియా తరఫున 264 మ్యాచ్‌ల్లో 72 గోల్స్ చేశాడు.