Ashes Series : యాషెస్ సిరీస్‌లో కనీవినీ ఎరుగని అద్భుతం ఆవిష్కృతమైంది. పేసర్ల వికెట్ల వేటతో ఉత్కంఠ రేపిన పెర్త్ టెస్టు (Perth Test) ఆశ్చర్యంగా రెండోరోజే ముగిసింది. తొలి రోజే 19 వికెట్లు పడడం ఒక రికార్డు అయితే.. ఆతిథ్య ఆసీస్ గెలుపొందడం మరో రికార్డు. మొత్తానికి యాషెస్ వందేళ్ల చరిత్రలోనే అరుదైన మ్యాచ్‌గా పెర్త్ టెస్టు పుస్తకాల్లోకెక్కింది. పేసర్లు వికెట్ల పండుగ చేసుకున్న చోట ఒకేఒక్కడు ఇంగ్లండ్ నుంచి విజయాన్ని లాక్కున్నాడు. తన అసాధారణ విధ్వంసంతో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head), బంతితో చెమటలు పట్టించిన మిచెల్ స్టార్క్ (Mitchell Starc) చరిత్రను తిరగరాశారు. పెర్త్ మ్యాచ్‌లో బద్ధలైన రికార్డులేంటో చూద్దాం..
టెస్టు ఫార్మాట్లోని అతిపెద్ద సిరీస్‌లలో ఒకటైన యాషెస్ ఆరంభం ‘నభూతో న భవిష్యత్’ అనే చెప్పాలి. ఆసీస్ గడ్డపై సిరీస్ విజయంపై గంపెడు ఆశలతో విమానమెక్కి వచ్చిన బెన్ స్టోక్స్ బృందానికి పెద్ద షాక్ తగిలింది. తొలి రోజే 19 వికెట్లు పడడంతో మ్యాచ్ ఫలితం రెండు మూడు రోజుల్లోనే తేలిపోనుందనే అంచనాకు వచ్చారంతా. ఇంగ్లండ్ ఆటగాళ్లు, కంగారూ టీమ్‌లోని స్టార్లు అపసోపాలు పడ్డచోట ట్రావిస్ హెడ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇంగ్లీష్ బౌలింగ్ దళాన్ని కకావికలం చేసిన ఈ చిచ్చరపిడుగు 69 బంతుల్లోనే శతకంతో ఆసీస్ విజయంలో కీలకమయ్యాడు. అంతే.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసి.. ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రికార్డుల విషయానికొస్తే..
A Travis Head masterclass pulls Australia to one of the most astounding #Ashes victories of all time!
All the action: https://t.co/9jWa4DVSnt pic.twitter.com/POC4UPbPS8
— cricket.com.au (@cricketcomau) November 22, 2025
ఐదోరోజులు రసవత్తర పోరాటం చూడాలనుకున్న అభిమానులకు పెర్త్ టెస్టు రెండో రోజే మ్యాచ్ ముగిసింది. ఇలా రెండురోజుల్లోనే ఫలితం తేలడం ఈ సిరీస్ వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. ఇదివరకూ 1921లో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో మ్యాచ్ సైతం రెండు రోజుల్లోనే ముగిసింది. బంతుల పరంగానూ పెర్త్ టెస్టు రికార్డు పట్టేసింది. ఈ మ్యాచ్‌లో 847 బంతుల్లోనే మ్యాచ్ పూర్తైంది. యాషెస్ చరిత్రలో ఇంత తక్కువ బంతులు వేయడం ఇది మూడోసారి మాత్రమే. 1888లో ఇంగ్లండ్ గడ్డపై 788 బంతుల్లోనే మ్యాచ్ ముగియగా.. 1894-95 సిడ్నీలో 911 బంతుల్లోనే విజేత ఎవరో తేలిపోయింది.
సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో వేగవంతమైన వంద కొట్టిన రెండో కంగారూ ఓపెనర్‌గా చరిత్ర లిఖించాడు. 69 బంతుల్లోనే శతక గర్జన చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ వెటరన్ డేవిడ్ వార్నర్ (David Warner) రికార్డు సమం చేశాడు. వార్నర్ 2012లో భారత్‌పై ఇన్నేసి బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్లో వేగవంతమైన సెంచరీ బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉంది. ఈ చిచ్చరపిడుగు 2015లో ఆస్ట్రేలియాపై కేవలం 54 బంత్లులోనే వంద కొట్టేశాడు.
100 off just 69 balls! Travis Head, what an innings! #Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/oiV1QEneYp
— cricket.com.au (@cricketcomau) November 22, 2025
పేస్, బౌన్సీ ట్రాక్ మీద బ్యాటర్ల తడబడడంతో ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆ జట్టు ఆటగాళ్లు 405 బంతులే ఎదుర్కొన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 32.5 ఓవర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో 34.4 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది. ఇంత తక్కువ బంతులకే ఇంగ్లండ్ ఆలౌటవ్వడం ఇది మూడోసారి. అంతేకాదు పెర్త్‌లో ఇంగ్లండ్‌కు వరుస ఓటముల పరంపర కొనసాగుతోంది.
England’s two innings in Perth totalled just 405 deliveries – the fastest they’ve been bowled out twice in a Test match since 1904🤯 pic.twitter.com/KDTW7S6EQw
— Sky Sports Cricket (@SkyCricket) November 22, 2025
పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా రన్ రేటు కూడా అమోఘమనే చెప్పాలి. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఓవర్‌కు 7.23 చొప్పున పరుగులు సాధించింది. రెండొందలకు పైగా ఛేదనలో 7కుపైగా రన్‌రేటు అనేది అత్యధికం. ఆసీస్ 28.2 ఓవర్లలోనే 205 పరుగులను ఉఫ్‌మనిపించింది. అంతేకాదు నాలుగో ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇది నాలుగోసారి. పెర్త్ టెస్టు కంటే ముందు ఛేదనలో రన్‌రేట్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో ఆ జట్టు న్యూజిలాండ్‌పై 299 పరుగుల లక్ష్యాన్ని .98 రన్‌రేటుతో ఛేదించింది.
యాషెస్ సిరీస్ ఓపెనర్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించడంలో మిచెల్ స్టార్క్ కీలకమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన ఈపేసర్ ఏడు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. 7/58తో కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మిస్సైల్ స్టార్క్.. రెండో ఇన్నింగ్స్‌లో 3/55తో బెన్ స్టోక్స్ బృందాన్ని వణికించాడు. రెండింటా కలిపి.. ఒక మ్యాచ్‌లో10/113తో రికార్డు నెలకొల్పాడీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.
WHAT A RIDICULOUS TAKE! Mitchell Starc sends Zak Crawley off for a pair! #Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/1cg8PtLzx4
— cricket.com.au (@cricketcomau) November 22, 2025
యాషెస్‌లో దివంగత షేన్ వార్న్ (Shane Wanrne) తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో ఆసీస్ బౌలర్‌గా నిలిచాడు. వార్న్ 2005లో ఓవల్ మైదానంలో పది వికెట్లతో మెరిశాడు. తొలిసారి ఈ మైలురాయికి చేరువైంది మాత్రం క్రెగ్ మెక్‌డెర్మాట్. 1991లో అతడు 11/157తో రాణించాడు.