కొండాపూర్, సెప్టెంబర్ 14: ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి ముందుకొచ్చింది. ‘మైండ్ స్పేస్ ఫర్ అథ్లెట్స్’ పేరిట ప్లేయర్లకు ప్రత్యేక స్పోర్ట్స్ ఫెలోషిప్‌ను అందజేస్తున్నట్లు రహేజా కార్ప్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం మాదాపూర్ మైండ్‌స్పేస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత ఆకుల శ్రీజ తన కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పోర్ట్స్ ఫెలోషిప్‌లో భాగంగా తొలుత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లను గుర్తించి వారికి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఫెలోషిప్ ద్వారా క్రీడాకారులు అవరోధాలను అధిగమించడంతో పాటు న్యూట్రిషన్, కోచింగ్‌కు అండగా ఉంటుందన్నారు. తొలి దశలో ఆకుల శ్రీజ, అనుక్రమ్ జైన్, జక్కాల గౌరి, కేశవన్ కణ్ణన్, రాగ నివేదిత, సాయినాథ్ రెడ్డి, స్నేహిత్, వరుణ్ శంకర్ ఉన్నారు. దీని ద్వారా ఎంపికైన ప్లేయర్లు దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ కామన్వెల్త్ చాంపియన్‌షిప్, దక్షిణాసియా గేమ్స్, ఐటీటీఎఫ్ వంటి గుర్తింపు టోర్నీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల ప్లేయర్లను ఆదుకునేందుకు అవసరమైన శిక్షణ తదితర అంశాలలో మద్దతును అందించడంలో మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.