దుబాయ్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith).. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్షణం నుంచి వన్డే క్రికెట్ నుంచి విరమణ తీసుకుంటున్నట్లు చెప్పాడు. తాజాగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో.. ఆస్ట్రేలియా జట్టు సారధిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. దీంతో 35 ఏళ్ల స్మిత్.. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. స్టీవ్ స్మిత్ తన కెరీర్లో 170 వన్డేలు ఆడాడు. వాటిల్లో 5800 రన్స్ చేశాడు. దీంట్లో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్యాట్ కమ్మిన్స్ గైర్హాజరీలో చాంపియన్స్ ట్రోఫీ కోసం స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. తన వన్డే జర్నీ అద్భుతంగా సాగిందని, ప్రతి క్షణాన్ని ప్రేమించినట్లు స్మిత్ తెలిపాడు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నో అద్భుత క్షణాలు ఉన్నాయని, మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఉన్నాయని, రెండు ప్రపంచ కప్‌లు గెలవడం సంతోషంగా ఉందని, తనతో ఎంతో మంది జట్టు సభ్యుల్ని కెరీర్‌ను పంచుకున్నట్లు స్మిత్ తన ప్రకటనలో తెలిపాడు.
2027 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు సమాయత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని స్మిత్ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నానని, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ పాల్గొనున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్లలో స్టీవ్ స్మిత్ 12వ బ్యాటర్‌గా నిలిచాడు. 2015 నుంచి 2025 వరకు ఆస్ట్రేలియాకు 64 మ్యాచుల్లో సారధిగా చేశాడు.
The two-time @cricketworldcup winner has announced his immediate retirement from ODI cricket 😲https://t.co/2E0MNR57tm
— ICC (@ICC) March 5, 2025