హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ స్కేటర్ పడిగ తేజేష్ జాతీయస్థాయిలో మరోమారు మెరిశాడు. బెంగళూరులో జరుగుతున్న 60వ జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తేజేష్ మూడు స్వర్ణాలు సహా రెండు రజతాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇన్లైన్ఫ్రీ స్కేటింగ్, పెయిర్ స్కేటింగ్, క్వాట్రెట్ స్కేటింగ్‌లో పసిడి పతకాలు దక్కించుకున్న ఈ యువ స్కేటర్ సోలో డ్యాన్స్, షో గ్రూపులో రజతాలు కైవసం చేసుకున్నాడు. అర్జున అవార్డు గ్రహీత అనూప్‌కుమార్ యామా దగ్గర శిక్షణ తీసుకుంటున్న తేజేష్ వచ్చే ఏడాది జరిగే 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ టోర్నీకి అర్హత సాధించాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తేజేష్ ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో కలిపి 129 పతకాలు సాధించాడు.