National Games | డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. శనివారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును రాష్ట్ర యువ అథ్లెట్ నిత్య గాదె 11.79 సెకన్లలో ముగించి రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో సుదేశ్న శివశంకర్(11.76సె, మహారాష్ట్ర), గిరిధారిని(11.88సె, తమిళనాడు) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు మహిళల నెట్‌బాల్ ఈవెంట్లో తెలంగాణ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌లో తెలంగాణ 49-46 తేడాతో చండీగఢ్‌పై అద్భుత విజయం సాధించింది.