న్యూఢిల్లీ : భారత్ వేదికగా త్వరలో జరిగే అంతర్జాతీయ జావెలిన్‌త్రో టోర్నీలో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా బరిలోకి దిగబోతున్నాడు. హర్యానాలోని పంచకులలో మే 24వ తేదీ నుంచి మొదలయ్యే గ్లోబల్ జావెలిన్ త్రో టోర్నీలో నీరజ్‌తో పాటు పలువురు ప్రముఖ అథ్లెట్లు పోటీపడనున్నారు. తావు దేవిలాల్ స్టేడియంలో జరిగే ఈ టోర్నీకి ఇప్పటికే ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య గవర్నింగ్ బాడీ క్యాటగిరీ-ఏ హోదా ఇచ్చింది. అయితే సమాఖ్య అధికారిక వెబ్సైట్లో మాత్రం దీన్ని ఇంకా పొందుపర్చాల్సి ఉంది. ఈ టోర్నీ ద్వారా భారత్ ప్రతిష్ఠాత్మక చాంపియన్‌షిప్‌లు నిర్వహించే సత్తాను ప్రదర్శించవచ్చని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో పేర్కొన్నాడు. నిర్వాహక కమిటీలో సభ్యుడైన నీరజ్‌చోప్రా..ఈ టోర్నీ భారత్‌కు రావడంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపాడు. చోప్రా లాంటి ప్రముఖ అథ్లెట్‌తో పోటీపడటం ద్వారా యువ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం ప్రోది చేసినట్లు అవుతుందని ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్‌సింగ్ అన్నాడు.