లాహోర్: స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలమై లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే నిష్క్రమించిన పాక్ జట్టులో భారీ మార్పులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శ్రీకారం చుట్టింది. ఈనెల 16 నుంచి న్యూజిలాండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాను ఆ జట్టు సారథి మహ్మద్ రిజ్వాన్‌తో పాటు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పై వేటు వేసింది. గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఈ ఇద్దరూ మరీ నెమ్మదిగా ఆడుతూ తీవ్రస్థాయిలో విమర్శలెదుర్కుంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిన రెండు మ్యాచ్‌లలో అదే ఆటతీరుతో విఫలమైన నేపథ్యంలో పీసీబీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. రిజ్వాన్‌ను టీ20ల నుంచి తప్పించిన పీసీబీ.. యువ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ అఘాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. చాలాకాలం తర్వాత షాదాబ్ ఖాన్ జట్టులోకి రాగా అతడికి వైస్ కెప్టెన్సీ దక్కింది. అయితే టీ20లలో స్థానం దక్కించుకోలేకపోయినా వన్డేలలో మాత్రం రిజ్వాన్, బాబర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. కానీ స్టార్ పేసర్లు హరీస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది వన్డే జట్టుకు ఎంపిక కాలేదు. హెడ్‌కోచ్ అకీబ్ జావేద్‌పై వేటు పడుతుందని ఊహాగానాలు వినిపించినా పీసీబీ మాత్రం అతడిని కొనసాగించింది.