హైదరాబాద్, ఆట ప్రతినిధి/ఖైరతాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ‘తెలంగాణ ట్రై క్రీడా వేడుకలు’ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. సాట్స్ ఆధ్వర్యంలో క్రీడా సంఘాల సహకారంతో సోమవారం సైక్లింగ్, స్కేటింగ్, రెజ్లింగ్ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. తొలుత నెక్లెస్‌రోడ్‌లోని నీరాకేఫ్ దగ్గర సైక్లింగ్ రేసును మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. వయసుతో సంబంధం లేకుండా భారీ సంఖ్యలో సైక్లిస్టులు ఈ పోటీలో పాల్గొన్నారు. మంత్రితో పాటు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు సరదాగా కొద్దిసేపు సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉంది. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం క్రీడలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నది. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తున్నది’ అని అన్నారు. ఆ తర్వాత ఇందిరాపార్క్‌లో స్కేటింగ్ పోటీలను మంత్రి ప్రారంభించారు. భారీ సంఖ్యలో యువ స్కేటర్లు ఈ పోటీల్లో పాలుపంచుకున్నారు. మరోవైపు యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో మహిళల రెజ్లింగ్ పోటీలను సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలకు భారీ స్పందన లభించింది. పోటీల విజయవంతానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ల ప్రతినిధులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు రవికుమార్, శ్రీనివాస్‌యాదవ్, బాలరాజు యాదవ్, కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.