హైదరాబాద్, ఆట ప్రతినిధి: బహ్రెయిన్ వేదికగా ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ జూనియర్ స్నూకర్ చాంపియన్‌షిప్ టోర్నీకి తెలంగాణ యువ క్యూయిస్టు జీ శ్రీకాంత్ ఎంపికయ్యాడు. ఈ మెగాటోర్నీలో శ్రీకాంత్.. భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడని తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న శ్రీకాంత్.. బెంగళూరులో ఇటీవల జరిగిన సెలెక్షన్ క్యాంప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టాప్ ప్లేయర్స్ అయిన దేవ్‌సింగ్‌పై 3-0తో అదే జోరులో మయాంక్ కార్తీక్‌ను 2-1తో చిత్తుగా ఓడించిన శ్రీకాంత్..ప్రపంచ టోర్నీకి భారత జూనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మెగాటోర్నీలో ఆడబోతున్న హైదరాబాదీ ప్లేయర్ స్పందిస్తూ ‘ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 13 ఏండ్ల వయసులోనే స్నూకర్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను.
ఆటను జాగ్రత్తగా పరిశీలించిన నేను ప్రతీ రోజు గంటలకొద్ది ప్రాక్టీస్ చేసి నైపుణ్యం దక్కించుకున్నాను. కెరీర్ మొదట్లో చాలా మంది నా సత్తాపై అనుమానాలు వ్యక్తం చేశారు. నీవు ఇందులో విజయవంతం కాలేవంటూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్కో మెట్టు ఎదిగాను. నా ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు’ అని అన్నాడు.