గంగాధర, జూన్ 12: నేపాల్లో ఈ నెల 18న జరిగే అంతర్జాతీయ పోటీలకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన రావుల శ్రీహాసిని ఎంపికైంది. గ్రామానికి చెందిన లచ్చగౌడ్-జ్యోతి దంపతుల కూతురైన శ్రీ హాసిని చిన్ననాటి నుంచే కబడ్డీలో రాణిస్తున్నది. ఈ క్రమంలో గత ఏప్రిల్లో ఢిల్లీలో నిర్వహించిన స్టేయిర్స్ యూత్ జాతీయ స్థాయి అండర్-19 బాలికల కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి, నేపాల్లో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు భారత్ తరపున ఎంపికైంది. శ్రీహాసినిని తాజా మాజీ సర్పంచ్ శ్రీమల్ల మేఘరాజు, గ్రామస్తులు శాలువాతో సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు.