Asia Cup | దంబుల్లా (శ్రీలంక) : మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ. రెండు వారాలుగా దంబుల్లా వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టు.. తుదిపోరులో ఆతిథ్య శ్రీలంక చేతిలో అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 60, 10 ఫోర్లు) టాప్ స్కోరర్. రిచా ఘోష్ (14 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. అనంతరం ఛేదనలో లంక రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయినా కెప్టెన్ చమరి ఆటపట్టు (43 బంతుల్లో 61, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (51 బంతుల్లో 69 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి లంకకు 18.4 ఓవర్లలోనే విజయాన్ని అందించారు.
టోర్నీ ఆసాంతం రాణించిన భారత బౌలర్లు ఫైనల్లో రెండంటే రెండే వికెట్లు పడగొట్టారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత.. అనూహ్యంగా చెలరేగి ఆ జట్టుకు తొలి ఆసియా కప్ టైటిల్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీ చరిత్రలో ఆరు సార్లు ఫైనల్ చేరిన లంకేయులకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యంతో పాటు బౌలర్ల ప్రదర్శన నాసిరకంగా ఉండటంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు ఓటమి తప్పలేదు. ఫైనల్లో రాణించిన హర్షితకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా టోర్నీ ఆసాంతం రాణించిన ఆటపట్టుకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.