దుబాయ్: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య వచ్చే నెలలో గాలే వేదికగా జరుగబోయే మొదటి టెస్టు ను ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు. సాధారణంగా టెస్టులు అంటే ఐదు రోజులే జరుపుతుండగా గాలే టెస్టు కు మాత్రం రిజర్వ్ డే ను ఏర్పాటు చేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. తొలి టెస్టు సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య జరగాల్సి ఉండగా 21వ తేదీ నాడు విశ్రాంతినిచ్చారు. అదే రోజు శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో ఆరోజు మ్యాచ్ను నిర్వహించడం లేదని ఐసీసీ తెలిపింది. స్వదేశంలో ఆరు రోజుల టెస్టు ఆడనుండటం లంకకు 23 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా ఆ జట్టు 2001లో జింబాబ్వేతో ఆడిన టెస్టును 6 రోజులు ఆడింది.