Uncle Percy: వన్డే వరల్డ్ కప్‌లో పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తున్న శ్రీలంకకు మరో భారీ షాక్ తాకింది. సుమారు ఐదు దశాబ్దాలుగా శ్రీలంక క్రికెట్‌కు అతిపెద్ద ఫ్యాన్.. ఆ జట్టు ఎక్కడ క్రికెట్ ఆడితే అక్కడికి వెళ్లి లంకేయులకు మద్దతునిచ్చే అంకుల్ పెర్సీ (డబ్ల్యూ. డి. పెర్సీ జిమ్సన్ మెండిస్ అబేసేకర) కన్నుమూశారు. 87 ఏండ్ల వయసున్న అంకుల్ పెర్సీ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు లంక మాజీ క్రికెటర్లు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
స్వదేశంతో పాటు విదేశాల్లో లంక జట్టు ఎక్కడ క్రికెట్ ఆడితే అక్కడికి వెళ్లి శ్రీలంక జెండాను ఊపుతూ ఆటగాళ్లకు మద్దతునిచ్చే అంకుల్ పెర్సీ ఏడాదిన్నర కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కూడా చేసింది.
RIP #unclepercy 😞😞😞 pic.twitter.com/yhXNKoTacD
— Russel Arnold (@RusselArnold69) October 30, 2023
ప్యూర్ క్రికెట్ ఫ్యాన్..
1936, జూలై 30న లంకలోని బూసాలో జన్మించిన పెర్సీ చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు. 1948లో ఆస్ట్రేలియా జట్టు లంక (అప్పుడు ఆల్ సిలోన్ పేరు మీద ఆడారు) పర్యటనకు వచ్చినప్పుడు సర్ డాన్ బ్రాడ్‌మన్ ఆటను చూసి ఆట పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీ రోజుల్లోనే ఆయన కొలంబోలోని సెయింట్ అలోయూసిస్ కళాశాల తరఫున ఆడుతూ తన జట్టుకు సారథిగా కూడా వ్యవహరించారు. ఇదే క్రమంలో లంక జట్టుకు 1979 నుంచి సపోర్టర్‌గా ఉన్నారు. 2020 వరకూ ఆయన లంకకు బిగ్గెస్ట్ సపోర్టర్. శ్రీలంక ఆటగాళ్లతో అతడికి సత్సంబంధాలున్నాయి.
ఇంటికెళ్లి కలిసిన రోహిత్..
RIP percy uncle, Captain Rohit met hin during asia cup pic.twitter.com/0TJAr7lbTY
— Harsh (@harshthengineer) October 30, 2023
భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీతో పాటు మహేంద్ర సింగ్ ధోనీలు పలు సందర్భాలలో పెర్సీని కలిశారు. 2015లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించినప్పుడు కోహ్లీ.. పెర్సీని టీమిండియా డ్రెస్పింగ్ రూమ్‌కు ఆహ్వానించాడు. కొద్దిరోజుల క్రితమే ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లిన భారత సారథి రోహిత్ శర్మ అంకుల్ పెర్సీని కలిసిన విషయం తెలిసిందే. పెర్సీ తన కొడుకు (సంపత్ గారీఫిల్డ్)కు పుట్టిన పిల్లలకు క్రికెటర్ల పేర్లు కలిసేలా నామకరణం చేయడం గమనార్హం. సర్ గారీఫిల్డ్ సోబర్స్‌తో పాటు సచిన్ టెండూల్కర్‌ను అమితంగా ఇష్టపడే పెర్సీ.. ఇద్దరు మనవలకు అవింకా గారీఫిల్డ్, సచింక అని పేర్లు పెట్టారు.