జిలాంగ్: క్వాలిఫయింగ్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఓడి నిరాశ పరిచిన మాజీ చాంపియన్ శ్రీలంక.. ఆ తర్వాత వరుసగా రెండో విజయంతో టీ20 వరల్డ్‌కప్ సూపర్-12కు అర్హత సాధించింది. గురువారం జరిగిన గ్రూప్-‘ఎ’ మ్యాచ్‌లో లంక 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా.. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన నెదర్లాండ్స్ కూడా సూపర్-12కు చేరింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (44 బంతుల్లో 79; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చరిత అసలంక (31) కాస్త పోరాడాడు. ప్రత్యర్థి బౌలర్లలో మీకెరెన్, బాస్ లీడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మ్యాక్స్ డౌడ్ (71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకు అజేయంగా క్రీజులో నిలిచి జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. లంక బౌలర్లలో హసరంగ 3, తీక్షణ రెండు వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
యూఏఈ తొలి గెలుపు
గ్రూప్-‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈ 7 పరుగుల తేడాతో నమీబియాపై విజయం సాధించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో యూఏఈకి ఇదే తొలి విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. వసీమ్ (50), రిజ్వాన్ (43 నాటౌట్) రాణించారు. అనంతరం ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 రన్స్ చేసింది. డేవిడ్ వైస్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. క్వాలిఫయింగ్ టోర్నీ గ్రూప్-‘ఎ’లో మ్యాచ్‌లు ముగియగా.. రెండేసి విజయాలు సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స సూపర్-12లో అడుగుపెట్టాయి. ఒక్కో గెలుపు ఖాతాలో వేసుకున్న నమీబియా, యూఏఈ ఇంటి బాటపట్టాయి. ఇక శుక్రవారం జరుగనున్న మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌తో వెస్టిండీస్, స్కాట్లాండ్తో జింబాబ్వే తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల విజేతలు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. శనివారం నుంచి సూపర్-12 పోటీలు ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలపడనుంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న మెగా ఫైట్ లో దాయాది పాకిస్థాన్‌తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. దీనికోసం రోహిత్‌సేన గురువారమే మెల్బోర్న్ చేరుకుంది.