చివరి ఐపీఎల్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2021 ఐపీఎల్ తర్వాత ఈ జట్టు హెడ్‌కోచ్ ట్రెవర్ బేలిస్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హడిన్ కూడా ఈ ఫ్రాంచైజీకి వీడ్కోలు పలికారు. దీంతో కొత్త కోచ్ కోసం సన్‌రైజర్స్ (ఎస్ఆర్హెచ్) వెతుకులాటలో పడింది.
అయితే ప్రస్తుతం జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న టామ్ మూడీనే జట్టు కోచ్‌గా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడీ గతంలో ఎస్ఆర్హెచ్కు కోచ్‌గా సేవలందించాడు. అలాగే జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ పదవి కోసం స్టెయిన్‌తో జట్టు యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు స్టెయిన్ కూడా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సీజన్ నుంచే వీరిద్దరూ తమ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.