Slapgate Video : ఐపీఎల్లో సంచలనం సృష్టించిన ‘చెంప దెబ్బ’ (Slapgate) వీడియో బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. పదిహేడేళ్ల నాటి సంఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం ఏంటని? పలువురు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి (Bhuvaneshwari) మండిపడింది. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా? మీకు అసలు సిగ్గుందా? మీరు మనుషులేనా? అని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో లలిత్ మోడీ(Lalith Modi) , మైఖేల్ క్లార్క్ (Michael Clarke)ను తీవ్రంగా విమర్శించింది.
‘మిమ్మల్ని చూస్తే సిగ్గనిపిస్తుంది. మీరు అసలు మనుషులేనా?.. ఎప్పుడో 2008లో జరిగిన సంఘటనకు మీ చీప్ పబ్లిసిటీ కోసం.. వ్యూస్ కోసం వాడుకుంటారా?.. ఆ దురుదృష్టకరమైన విషయాన్ని హర్భజన్, శ్రీశాంత్ మరచిపోయి తమతమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు వాళ్లు తండ్రులయ్యారు. ఇద్దరికీ బడికి వెళ్లే పిల్లలు ఉన్నారు. ఈ సమయంలో మీరు ఇరువురిని మళ్లీ పాత వివాదంలోకి లాగాలనుకుంటున్నారా?.. ఇది చాలా హేయమైన పని. హృదయం లేనివాళ్లు, మానవత్వంలేని వాళ్లు మాత్రమే ఇలా చేస్తారు.
Sreesanth’s wife Bhuvneshwari hit out at Lalit Modi! 👀#Cricket #HarbhajanSingh #Sreesanth #Sportskeeda pic.twitter.com/OBJhpXdd6C
— Sportskeeda (@Sportskeeda) August 30, 2025
తాజాగా పాడ్‌కాస్ట్ షోలో లలిత్ మోడీ బహిర్గతం చేసిన స్లాప్‌గేట్ వీడియో మా కుటుంబాన్ని ఎంతగానో బాధించింది. అభంశుభం తెలియని మా పిల్లలు ఇప్పుడు తమకు సంబంధం లేని విషయం గురించి సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని శ్రీశాంత్ భార్య తన ఆక్రోషాన్ని వెల్లగక్కింది.
ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చేయిచేసుకున్నాడు. తమ జట్టు 66 పరుగుల తేడాతో ఓడిన తర్వాత ఆటగాళ్లు కరచాలనం సమయంలో భజ్జీ పంజాబ్ పేసర్ శ్రీశాంత్‌ను ఏదో మాట అని.. చెంపపై కొట్టాడు. ఊహించని పరిణామంతో కంగుతిన్న పేసర్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేయగా.. హర్భజన్ కోపంగా అతడి వైపు రాబోయాడు. అయితే.. ఇదంతా గమనించిన మహేల జయవర్దనే.. ఇర్ఫాన్ పఠాన్ ఇరువురిని దూరం లాక్కెళ్లారు. అప్పట్లో ఈ వీడియో సంచలనం రేపింది. తాను చేసిన పనికి పలుమార్లు శ్రీశాంత్‌కు హర్భజన్ క్షమాపణలు చెప్పాడు. ఈమధ్యే శ్రీశాంత్ కూతురు నువ్వు మా నాన్నను కొట్టావ్? అని ప్రశ్నించడంతో తన మనసుకు ఎంతో బాధ కలిగిందని భజ్జీ తెలిపాడు. ఆ చిన్నారి తనను చెడ్డవాడిగా చూస్తోందని మాజీ స్పిన్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Why did the Harbhajan-Sreesanth slapgate video stay hidden for 17 years? 🤔
Harsha Bhogle reveals:
“Very few of us saw it back then. We promised not to release it — IPL was in its first year, and it would’ve been terrible publicity.”pic.twitter.com/GNq6YuAl77— Sporttify (@sporttify) August 30, 2025
ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్ క్లార్క్ బియాండ్23పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోడీ మాట్లాడుతూ చెంప దెబ్బ వీడియోను విడుదల చేశాడు. ‘ఆరోజు మ్యాచ్ తర్వాత కెమెరామెన్లు బ్రేక్ తీసుకున్నారు. కానీ, నేను మైదానంలోకి వెళ్తుండడంతో నా వ్యక్తిగత కెమెరామెన్ వీడియో తీస్తున్నాడు. ఆటగాళ్లు కరచాలనం చేస్తుండగా భజ్జీ ఉన్నట్టుండి కోపంగా శ్రీశాంత్ చెంపమీద కొట్టాడు’ అని లలిత్ మోడీ వెల్లడించాడు.