నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: అత్యుత్తమ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచ సమరం చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు మ్యాచ్‌ల్లో విశ్వ విజేత ఎవరో తేలిపోనుంది. గ్రూప్-2 నుంచి టీమ్ఇండియా నిలకడగా రాణించి ముందంజ వేస్తే.. ఆఖర్లో అదృష్టం కలిసొచ్చి పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆసీస్ సూపర్ -12 లోనే నిష్క్రమించగా.. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరాయి. మెగాటోర్నీలో ఈ నాలుగు జట్ల ఆటతీరును ఓ సారి పరిశీలిస్తే..
సమతూకంగా..
ప్రస్తుత ప్రపంచకప్‌లో నాలుగు విజయాలు సాధించి ఎనిమిది పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెట్టిన టీమ్ఇండియా.. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఘనవిజయం సాధించిన భారత్.. ఆ తర్వాత దక్షిణఫ్రికాతో మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వేపై విజయాలతో ముందంజ వేసింది.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్ దంచికొడుతుండటంతో రోహిత్ సేన నాలుగు విజయాలు ఖాతాలో వేసుకోగలిగింది.
ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 123.00 సగటుతో 246 పరుగులు చేసిన కోహ్లీ వరల్డ్‌కప్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
అనూహ్యంగా దూసుకొచ్చి..
సంచలనాలకు కేంద్ర బిందువైన పాకిస్థాన్.. ఈ సారి అనుకోకుండా సెమీఫైనల్ చేరింది. ఆరంభ పోరులో టీమ్ఇండియా చేతిలో పరాజయం పాలైన పాక్.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో ఓడి ఘోరంగా దెబ్బతిన్నది. ఈ దశలో పాక్ సెమీస్ చేరుతుందని ఎవరూ ఊహించకున్నా.. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో పాక్‌కు మార్గం సుగమమైంది. బౌలర్లు సత్తాచాటుతుండటం పాక్‌కు కలిసొచ్చే అంశం కాగా.. టాపార్డర్ వరుస వైఫల్యాలు ఆ జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా బాబర్ పేలవ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది.
పేస్, బౌన్స్‌కు సహకరిస్తున్న ఆసీస్ పిచ్‌లపై షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవుఫ్‌తో కూడిన పాక్ పేస్ దళం మంచి ఫలితాలు రాబడుతున్నది.
సెమీస్ స్టార్ కివీస్
ఐసీసీ మెగా టోర్నీల్లో నిలకడగా.. సెమీఫైనల్‌కు చేరే అలవాటు ఉన్న న్యూజిలాండ్ మరోసారి ఆ పరంపర కొనసాగించింది. తాజా మెగాటోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై గెలువడంతోనే సగం పని పూర్తి చేసుకున్న కివీస్.. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ముందంజ వేసింది. ఫిలిప్స్, కాన్వే, అలెన్ రూపంలో యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్‌లోకి రావడం సెమీఫైనల్లో న్యూజిలాండ్‌కు కలిసిరానుంది.
ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్ రూపంలో ముగ్గురు ప్రపంచ స్థాయి బౌలర్లు న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతా దంచికొట్టుడే..
పొట్టి ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన ఇంగ్లండ్.. తాజా టోర్నీలో మూడు విజయాలతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన ఐర్లాండ్‌తో పోరులో మినహాయిస్తే.. ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. హోరాహోరీగా ఖాయమనుకున్న ఆసీస్‌తో పోరు వర్షార్పణమైంది. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌పై నెగ్గి ముందంజ వేసింది. బట్లర్, స్టోక్స్, హేల్స్, బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కరన్, లివింగ్‌స్టోన్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా కనిపిస్తున్నది.
బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మోయిన్ అలీ, సామ్ కరన్ రూపంలో నలుగురు నిఖార్సైన ఆల్‌రౌండర్లు ఉన్నారు.